కుదురు లేని మనిషి
అనగనగా త్రిపుర అనే రాజ్యంలో చలపతి అనే పనీపాటలేని యువకుడు ఉండేవాడు. తను డబ్బులు సులువుగా ఎలా దొరుకుతాయో ఆలోచిస్తూ కాలక్షేపం చేసే జులాయి. అదే రాజ్యంలో సూరయ్య అనే ఒక తేనె వర్తకుడు ఉండేవాడు. సూరయ్య ప్రతిరోజు ఉదయాన్నే అడవంతా వెతికి తేనెను సంపాదించి,ఆ తేనెను సంతలో అమ్మి సొమ్ము చేసుకునేవాడు. సూరయ్య గడించే లాభాన్ని చూసిన అతని స్నేహితుడు చలపతి తాను కూడా తేనెను అమ్మి డబ్బు సంపాదించాలని, వెంటనే సూరయ్య దగ్గరికి వెళ్లి, “మిత్రమా! నువ్వు చేసే పని నాకెంతో నచ్చింది. దయచేసి నన్ను కూడా నీతో తీసుకువెళ్ళవా” అని ప్రాధేయపడ్డాడు. దానికి సూరయ్య ఎంతో ఉదారంగా, "మిత్రమా ఇంతలా బతిమాలాల్సిన అవసరం లేదు. రేపు ఉదయాన్నే నాలుగు గంటలకు సిద్ధంగా ఉండు,” అని చెప్పి వెళ్ళిపోయాడు.